అలోపతి వైద్యులకు ఆయుర్వేద వైద్యులు ఏ మాత్రం తీసిపోరు: కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్

25-02-2021 Thu 07:38
  • అన్ని రకాల ఆపరేషన్స్ నూ చేయగలరు
  • అలోపతి, ఆయుర్వేదం ఒకదానితో ఒకటి పోటీ పడబోవు
  • ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద నాయక్
Central Minister Sripad Naik Comments on Allopathi Doctors Surgeons

ఇండియాలో శస్త్రచికిత్సలు చేసేందుకు ఆయుర్వేద వైద్యులనూ అనుమతించిన నేపథ్యంలో వస్తున్న విమర్శలపై కేంద్ర ఆయుష్ శాఖా మంత్రి శ్రీపాద నాయక్ స్పందించారు. ఆయుర్వేద వైద్యులు అలోపతి వైద్యులకు ఏ మాత్రమూ తీసిపోరని, వారు శస్త్రచికిత్సలు చేసేందుకు శిక్షణ తీసుకున్న వారేనని స్పష్టం చేశారు.

ఇటీవల ఓ ప్రమాదానికి గురైన ఆయన, గోవాలోని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన అనంతరం పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. అలోపతి వైద్యులు చేసే అన్ని రకాల చికిత్సలను, ఆపరేషన్స్ ను ఆయుర్వేద వైద్యులు కూడా చేయగలరని అన్నారు. అయితే, ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్సలు చేసే అవకాశాన్ని కల్పించడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తప్పుబడుతున్న సంగతి తెలిసిందే.

"భారతీయ వైద్య చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ఆయుర్వేదానికి భారత చరిత్రలో ఘనమైన చరిత్ర ఉంది. ఇండియాలోని అలోపతి రంగానికి మద్దతుగానే ఆయుర్వేద వైద్యం సాగుతుంది. దీన్నేమీ పోటీగా భావించాల్సిన అవసరం లేదు. శస్త్రచికిత్సల విషయంలో ఆయుర్వేద వైద్యులకు మరింత నైపుణ్యం కలిగేలా ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. విద్య పూర్తయిన తరువాత ఇది మొదలవుతుంది" అని శ్రీపాద నాయక్ అన్నారు.