శివరాత్రికి పవన్ సినిమా నుంచి ఫస్ట్ లుక్!

24-02-2021 Wed 21:11
  • పిరీడ్ మూవీగా పవన్, క్రిష్ సినిమా
  • హీరోయిన్లుగా నిధి అగర్వాల్, జాక్వెలిన్
  • 'హరిహర వీరమల్లు'గా టైటిల్ ఖరారు
  • మార్చ్ 11న ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్  
Pawan Kalyans first look from Krish film will be out for Shiv Ratri

ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రాలలోకెల్లా భారీ చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 17వ శతాబ్దం నాటి వాతావరణంలో పిరీడ్ మూవీగా నిర్మిస్తున్నారు. కోట్లు వెచ్చించి నాటి కాలాన్ని ప్రతిబింబించే వివిధ సెట్లను వేస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా విభిన్నమైన గెటప్పులో కనిపిస్తాడట.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను, సినిమా టైటిల్ ను కలిపి మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రం టైటిల్ని ఖరారు చేసినట్టు చెబుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా కోసం 'హరిహర మహాదేవ', 'వీరమల్లు' అనే రెండు టైటిల్స్ ను ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేశారు. చివరికి రెండు టైటిల్స్ ను కలిపి 'హరిహర వీరమల్లు'గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.