కేసీఆర్, విజయశాంతి, జగన్ గురించి షర్మిల సంచలన వ్యాఖ్యలు

24-02-2021 Wed 20:55
  • నా స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు
  • కేసీఆర్, విజయశాంతిలు తెలంగాణ వాళ్లేనా?
  • నేను పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదు
YS Sharmilas sensational comments on KCR and Vijayashanthi and Jagan

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్న వైయస్ షర్మిల పదునైన వ్యాఖ్యలతో వేడి పుట్టించారు. ఈ రోజు విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నాయకురాలు విజయశాంతిలు తెలంగాణ వాళ్లేనా? అని ప్రశ్నించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ రాష్ట్రానికి చెందినవారు కాదని చెప్పారు. తాను పుట్టింది, పెరిగింది హైదరాబాదులోనే అని తెలిపారు.

దేవుడి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని షర్మిల అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను లేనంత మాత్రాన ఈ ప్రాంతంపై తనకు ప్రేమ ఉండదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల ఆశయాలు నెరవేరాయా? తెలంగాణ ప్రజల కష్టాలు తీరాయా? అని అడిగారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రాష్ట్రంలో గడపగడపకూ వెళ్లి వస్తానని చెప్పారు.

తాను పార్టీ పెట్టడం తన అన్న జగన్ కు ఇష్టం లేదని షర్మిల అన్నారు. జగన్ తో తనకున్నవి భిన్నాభిప్రాయాలో, విభేదాలో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. తనకు తన తల్లి విజయమ్మ మద్దతు ఉందని అన్నారు. త్వరలోనే పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు. అయితే మే 14 లేక జులై 9 అన్నది మీరే చెప్పాలంటూ విద్యార్థులను ఆమె అడిగారు. రైతు సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తామని తెలిపారు.