Peddapalli District: 108 సిబ్బందే బంగారం దొంగలు!

108 staff are the gold thieves
  • పెద్దపల్లి రోడ్డు ప్రమాదంలో బంగారం వ్యాపారం చేసే సోదరుల మృతి
  • డ్రైవర్, గుమాస్తాకు తీవ్ర గాయాలు
  • 2.30 కేజీల బంగారాన్ని దాచేసిన 108 సిబ్బంది
పెద్దపల్లి జిల్లాలో నిన్న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన సందర్భంగా కారులో వున్న 2.30 కేజీల బంగారం మాయమైన విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును రామగుండం పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం, రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారు వర్తకులు, సోదరులైన కొత్త శ్రీనివాసరావు, రాంబాబు దుర్మరణం పాలయ్యారు.

ఈ ప్రమాదంలో డ్రైవర్ డి.సంతోష్, గుమాస్తా గుండా సంతోష్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వారి కారు డివైడర్ ను ఢీకొనడంతో దాదాపు వంద అడుగుల దూరంలో ఉన్న సైన్ బోర్డును బలంగా తాకుతూ పక్కనున్న కాల్వలోకి పడిపోయింది.

గాయపడిన వారిని 108 వాహనంలో గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాపారుల వద్ద 5.60 కేజీల బంగారం ఉందని వారి కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే 108 సిబ్బంది మాత్రం 3.30 కిలోల బంగారాన్ని మాత్రమే ఎస్సై శైలజకు అప్పగించారు. దీంతో మరో 2.30 కేజీల బంగారం మిస్ అయినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. 24 గంటల్లోగా అసలు దొంగలను పోలీసులు పట్టేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న 108 డ్రైవర్ లక్ష్మారెడ్డి, ఎమర్జెన్సీ టెక్నీషియన్ తాజుద్దీన్ 2.300 కేజీల బంగారాన్ని దాచిపెట్టారు. మిగిలిన బంగారాన్ని పోలీసులకు ఇచ్చారు. అయితే బంగారం మిస్ అయిన నేపథ్యంలో పోలీసులు 108 సిబ్బందిని విచారించారు. పోలీసు విచారణలో వారు నిజాన్ని ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, 108 సిబ్బంది అత్యాశ వారికి చెడ్డపేరు తీసుకొచ్చేలా చేసిందని చెప్పారు. అత్యవసర సేవలు అందించే సిబ్బంది ఇలాంటి పనులు చేయకూడదని హితవు పలికారు.
Peddapalli District
Ramagundam
Gold Theft
108 staff

More Telugu News