'కొరోనిల్' మందు పేరిట బాబా రాందేవ్‌ మోసం చేశారంటూ ఆరోపణలు

24-02-2021 Wed 12:43
  • ‘కొరోనిల్’కు డబ్ల్యూహెచ్ఓ సర్టిఫికెట్ ఉందన్న రాందేవ్ బాబా
  • కేంద్ర మంత్రుల సమక్షంలో టీకా విడుదల
  • తాము ధ్రువీకరించలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • రాందేవ్ బాబా కోట్లాదిమందిని మోసగించారన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
People wanted to be arrest Patanjali Baba Ramdev

కరోనా టీకా ‘కొరోనిల్’ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రముఖ యోగా గురు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌ను అరెస్ట్ చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. పతంజలి అభివృద్ధి చేసిన ‘కొరోనిల్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సర్టిఫికెట్ ఉందని పేర్కొన్నారు. మంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ నెల 19న రాందేవ్ బాబా కొరోనిల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొరోనిల్‌కు డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరణ ఉందని పేర్కొన్నారు.

రాందేవ్ బాబా ప్రకటనపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొరోనిల్‌’కు తాము ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేయలేని వివరణ ఇచ్చింది. దీంతో రాందేవ్ బాబాపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు ప్రకటనతో ప్రజలను మోసగించిన ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు కూడా వారితో గొంతు కలిపాయి.

తాజాగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సూర్యప్రతాప్ సింగ్ కూడా రాందేవ్ బాబాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. రాందేవ్ బాబా కోట్లాదిమందిని మోసం చేసే ప్రయత్నం చేశారని, దీనిని అంతర్జాతీయ మోసంగా చూడాలని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.