భారత్ కు నెంబర్​ 1 వ్యాపార భాగస్వామి చైనానే.. సరిహద్దు గొడవలైనా తగ్గని వాణిజ్యం!

24-02-2021 Wed 12:38
  • 2020లో 5,61,767 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు
  • 4,24,368 కోట్ల విలువైన దిగుమతులు చైనా నుంచే
  • అమెరికా, యూఏఈలు ఆ తర్వాతి స్థానంలో
China regains slot as Indias top trade partner despite tensions

మొన్నమొన్నటిదాకా భారత్ తో చైనా కయ్యానికి కాలు దువ్వింది. హద్దులు దాటింది. మన 20 మంది సైనికుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. దీంతో చైనా ఉత్పత్తులను నిషేధించాలని, భారతీయులెవరూ ఆ దేశ వస్తువులు వాడొద్దని మన దగ్గర ఆందోళనలు కూడా జరిగాయి. కేంద్ర ప్రభుత్వమూ ఆ దేశానికి చెందిన 220 దాకా యాప్ లపై నిషేధం విధించింది. అయినా సరే అవేవీ మన దేశంలో చైనా వ్యాపారాన్ని ఆపలేకపోయాయి. పైగా 2020లో భారత అంతర్జాతీయ వాణిజ్యం ఎక్కువగా జరిగింది ఆ దేశంతోనే.

ఇరు పక్షాల మధ్య గత ఏడాది దాదాపు 7,770 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. మన రూపాయల్లో చెప్పాలంటే ఆ వ్యాపారం విలువ దాదాపు రూ.5,61,767 కోట్లు. అయితే, అంతకుముందు ఏడాది జరిగిన రూ.6,18,173 (8,550 కోట్ల డాలర్లు) కోట్ల వాణిజ్యంతో పోలిస్తే ఇది తక్కువే అయినా.. మిగతా దేశాలతో పోలిస్తే భారత వ్యాపారం ఎక్కువ చేసిన దేశాల జాబితాలో చైనానే ముందుంది.

వాస్తవానికి కరోనా మహమ్మారి సమయంలో చైనాతో వాణిజ్యానికి బ్రేకులు పడ్డాయి. అయితే, వైద్య పరికరాలు, ఇతర అవసరాల కోసం మొదట్లో చైనా మీదే భారత్ ఆధారపడింది. ఆ తర్వాత ఇక్కడే అన్నీ సమకూర్చుకున్నాక చైనా నుంచి దిగుమతులను ఆపేసింది.

మొత్తంగా ఆ ఏడాది చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 5,870 కోట్ల డాలర్లు (సుమారు రూ.4,24,368 కోట్లు). ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, యూఏఈలున్నాయి. ఆ రెండు దేశాల నుంచి కలిపి దిగుమతి చేసుకున్న దాని కన్నా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువే ఎక్కువ.