రోడ్డు ప్రమాదం తర్వాత మాయమైన 2.3 కిలోల బంగారం స్వాధీనం

24-02-2021 Wed 11:55
  • పెద్దపల్లి జిల్లాలో నిన్న ఉదయం రోడ్డు ప్రమాదం
  • నరసరావుపేటకు చెందిన నగలు వ్యాపారుల మృతి
  • బంగారాన్ని గుర్తించి ఎస్సైకి అప్పగించిన 108 సిబ్బంది
  • మరికొంత బంగారం మాయమైందని కుటుంబ సభ్యుల ఫిర్యాదు
  • 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Police recover 2 kg gold from culprits

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో నిన్న ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఇద్దరు బంగారం వ్యాపారులు మృతి చెందారు. ఆ సమయంలో వీరివద్ద కోటి రూపాయలకుపైగా విలువైన బంగారం ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైనట్టు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుల నుంచి ఆ బంగారాన్ని రాబట్టారు.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటకు చెందిన నగల వ్యాపారులు కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో బంగారం షాపులకు ఆభరణాలు విక్రయిస్తారు. నిన్న ఉదయం వీరు ప్రయాణిస్తున్న కారు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని మల్యాల మూలమలుపు వద్ద రాజీవ్ ‌రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాపారులు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కారులో వారితోపాటే ఉన్న సంతోష్ కుమార్, సంతోష్‌లు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం  అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వారి వద్ద బంగారాన్ని గుర్తించిన సిబ్బంది దానిని రామగుండం ఎస్సై శైలజకు అప్పగించారు. బాధితుల నుంచి 3 కిలోల 300 గ్రాముల బంగారం లభించినట్టు పోలీసులు కూడా ప్రకటించారు. దీంతో అనుమానించిన బాధిత కుటుంబ సభ్యులు వారి వద్ద ఉండాల్సిన మరో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఒక్క రోజులోనే కేసును ఛేదించారు. నిందితుల నుంచి మాయమైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.