చైనాకు ఝలక్.. రెండో దశలో ఆ దేశ టీకాలు వాడబోమన్న శ్రీలంక

24-02-2021 Wed 11:01
  • 5 లక్షల డోసుల టీకాలను ఉచితంగా ఇచ్చిన భారత్
  • కోవాక్స్ కార్యక్రమంలో 35 లక్షల డోసులు
  • మూడో దశ ప్రయోగ పత్రాలను చైనా అందించలేదన్న శ్రీలంక
Sri Lanka Refused to Use China Vaccine

పొరుగుదేశం శ్రీలంకకు భారతదేశం ఇటీవల 5 లక్షల డోసుల కరోనా టీకాలను ఉచితంగా అందించింది. దీంతో ఆ దేశంలో టీకా తొలి డోసు పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కోటి డోసుల ఆస్ట్రాజెనెకా టీకాను ఆ దేశం కొనుగోలు చేసింది. ‘కోవ్యాక్స్’ కార్యక్రమం కింద అదనంగా 35 లక్షల డోసుల టీకాలు శ్రీలంకకు లభించాయి. వీటితో తొలి దశ టీకా పంపిణీని ఆ దేశం పూర్తి చేసింది. త్వరలో రెండో దశ పంపిణీకి సమాయత్తం అవుతోంది.

అయితే, ఈ దశలో చైనా వ్యాక్సిన్‌ను వాడేది లేదని శ్రీలంక స్పష్టం చేసింది. టీకా మూడో దశ ప్రయోగాలకు సంబంధించిన పత్రాలను చైనా సమర్పించలేదని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక ఉద్యానవనశాఖ మంత్రి రమేశ్ పథిరణ తెలిపారు. చైనా, రష్యా టీకాలు ఇంకా సిద్దం కాకపోవడంతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను మాత్రమే వినియోగిస్తామని చెప్పారు. వైద్య నిపుణుల సూచన మేరకు రెండో విడత ఎప్పుడు ప్రారంభించేదీ చెబుతామన్నారు.