Corona Virus: కరోనా ఎఫెక్ట్: 2 కోట్ల ఏళ్ల జీవితకాలాన్ని నష్టపోయిన ప్రపంచం!

  • కరోనా వల్ల ఇప్పటి వరకు 25 లక్షల మందికిపైగా మృతి
  • భారత్ సహా 81 దేశాల్లోని కరోనా మరణాల సమాచారం విశ్లేషణ
  • 2,05,07,518 సంవత్సరాల జీవిత కాలం నష్టం
  • 44 శాతం పురుషుల జీవన కాలం నష్టం
20 million years of life lost worldwide due to COVID

కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేసేందుకు జరిగిన అధ్యయనం వెల్లడించిన విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి. కరోనా బారినపడి ఇప్పటి వరకు దాదాపు 25 లక్షల మందికిపైగా మరణించారు. ఫలితంగా సుమారు 2 కోట్ల ఏళ్ల జీవితకాలం నష్టం సంభవించిందని అధ్యయనం పేర్కొంది. భారత్‌తోపాటు 81 దేశాలకు చెందిన కరోనా మరణాల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం అంతర్జాతీయ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

అధ్యయన వివరాలు ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి సరాసరి ఆయుర్దాయాన్ని లెక్కగట్టిన పరిశోధకులు వారి కారణంగా 2,05,07,518 సంవత్సరాల జీవితకాలాన్ని కోల్పోయినట్టు అంచనా వేశారు.

హృద్రోగ వ్యాధుల వల్ల కలిగే ఇయర్స్ ఆఫ్ లైఫ్ లాస్ట్ (వైఎల్ఎల్) కంటే ఈ నష్టం 25 నుంచి 50 శాతం ఎక్కువని తేల్చారు. ఈ అధ్యయనంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, అమెరికాలోని విస్కాన్‌సిన్-మాడిసన్ యూనివర్సిటీ, జర్మనీకి చెందిన మాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ వంటి అంతర్జాతీయ యూనివర్సిటీల పరిశోధకులు పాల్గొన్నారు. కాగా, కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో 44 శాతం పురుషుల జీవన కాలం నష్టమే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

More Telugu News