నిఖిల్ సరసన నాయికగా మరోసారి అనుపమ

24-02-2021 Wed 10:06
  • '18 పేజెస్'లో నటిస్తున్న అనుపమ 
  • 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్ నిర్మాణం  
  • ఈ నెల 26న షూటింగ్ ప్రారంభం
Anupama opposite Nikhil again

తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నా మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ రేంజ్ మాత్రం పెరగడం లేదు. స్టార్ హీలతో సినిమాలు చేసే అవకాశాలు ఈ ముద్దుగుమ్మకు రావడం లేదనే చెప్పాలి. అందం, అభినయం ఉన్నప్పటికీ ఎందుకోగానీ రేసులో వెనకపడుతోంది. తన తర్వాత వచ్చిన కథానాయికలు దూసుకుపోతున్నప్పటికీ, అనుపమకు రేంజ్ పెరిగే ఛాన్సులు మాత్రం రావడం లేదు.

ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న '18 పేజెస్' సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటిస్తోంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ మూవీని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇది నిర్మాణంలో ఉండగానే అనుపమకు నిఖిల్ సరసన నటించే మరో ఛాన్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.

నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన 'కార్తికేయ' సినిమా మంచి హిట్టయింది. చందు మొండేటి దర్శకత్వంలోనే నిఖిల్ హీరోగా దీనికి సీక్వెల్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అనుపమను తీసుకుంటున్నట్టు తాజా సమాచారం. ఈ నెల 26 నుంచి షూటింగును నిర్వహించే ఈ 'కార్తికేయ 2' చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ కలసి నిర్మిస్తున్నారు.