Petrol: మన దేశంలో పెట్రోలు లీటరు రూ. 100.. వెనిజులాలో రూ. 1.45 పైసలు మాత్రమే!

Petrol prices rates dead cheap in poor countries than India
  • ప్రపంచవ్యాప్త పెట్రో ధరలను వెల్లడించిన ‘గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్’
  • మనకంటే సగం తక్కువగా పొరుగు దేశాల్లో
  • పేద దేశాల్లో 20 రూపాయల్లోపే
అభివృద్ధి బాటన పయనిస్తూ అగ్రదేశాల సరసన చేరుతున్న భారత్‌లో గత రెండు వారాలుగా పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోలు మాటెత్తితే చాలు వణికిపోయే పరిస్థితి వచ్చింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర రూ. 100 మార్కును ఎప్పుడో దాటేసింది.

శాస్త్రసాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తూ అగ్రదేశాలకు సవాలు విసురుతున్న మన దేశంలో పెట్రో ధరలు కళ్లేలు లేనట్టుగా పరుగులు తీస్తుంటే, కడు దుర్భర స్థితిలో ఉన్న దేశాల్లోను, అంతర్యుద్ధాలతో సతమతం అవుతున్న దేశాల్లోను, ఉగ్రవాదంతో అతలాకుతలం అవుతున్న దేశాల్లోనూ పెట్రోలు ధరలు మనలో సగం, అంతకంటే తక్కువ ఉండడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరలు ఎలా ఉన్నాయో చెప్పే గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ (www.globalpetrolprices.com/gasoline_prices) వెబ్‌సైట్ ప్రకారం.. లాటిన్ అమెరికా దేశం వెనిజులాలో ఈ నెల 22న లీటరు పెట్రోలు ధర భారత కరెన్సీ ప్రకారం రూ. 1.45 మాత్రమే. ఇరాన్‌లో రూ. 4.39, అంగోలాలో రూ. 17.77, అల్జీరియాలో రూ. 25.032, కువైట్‌లో రూ. 25.133 గా ఉండగా, దారిద్య్రంతో అల్లాడే ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో రూ. 27.207గా ఉండడం గమనార్హం. అలాగే, కజకి‌స్థాన్‌లో రూ. 29.285, తుర్క్‌మెనిస్థాన్‌లో రూ.31.084, నైజీరియాలో రూ.31.568, ఖతర్‌లో రూ. 29.285గా ఉంది.

భారత్ పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్‌లలోనూ పెట్రో ధరలు మనకంటే తక్కువగా ఉండడం గమనార్హం. శ్రీలంకలో లీటరు పెట్రోలు ధర రూ. 60.452 కాగా, నేపాల్‌లో రూ. 69.054, భూటాన్‌లో రూ. 45.564గా ఉండగా, ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్‌ అయిన పాకిస్థాన్‌లో మనకంటే సగం తక్కువగా అంటే లీటరు పెట్రోలు ధర రూ. 51.119గా ఉండడం విశేషం.
Petrol
Diesel
Price
globalpetrolprices
India

More Telugu News