కరోనా వైరస్‌లో మరో రెండు రకాల గుర్తింపు.. ఇందులో ఒకటి తెలంగాణలో!

24-02-2021 Wed 08:08
  • మహారాష్ట్ర, కేరళలో N440K, E484K వైరస్‌ రకాలు
  • కేసుల పెరుగుదలకు ఇవి కారణం కాకపోవచ్చన్న కేంద్రం
  • ఆందోళన అవసరం లేదన్న డాక్టర్ వీకే పాల్
Another Two Variants Discovered in India one in Telangana

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌లో మరో రెండు రకాలను గుర్తించారు. ప్రతి రోజు మళ్లీ వేలాది కేసులు వెలుగుచూస్తున్న మహారాష్ట్ర, కేరళలో N440K, E484K రకాలను గుర్తించినట్టు కేంద్రం తెలిపింది. అంతేకాదు, ఇందులో ఒకదాని జాడ తెలంగాణలోనూ కనిపించిందని పేర్కొంది. అయితే, పైన చెప్పిన రెండు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలకు ఈ కొత్త రకాలే కారణమని చెప్పలేమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.

ఇప్పటి వరకు 3,500 వైరస్ జన్యు పరిమాణ క్రమాలను విశ్లేషించగా, అందులో 187 మందిలో బ్రిటన్ రకం, ఆరుగురిలో దక్షిణాఫ్రికా, ఒక వ్యక్తిలో బ్రెజిల్ రకం వైరస్ సోకినట్టు గుర్తించినట్టు చెప్పారు. వీటి తదుపరి మ్యుటేషన్లపైనా దృష్టిసారించినట్టు తెలిపారు. వైరస్‌లో ఉత్పరివర్తనాలు సహజమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వైరస్‌లో మార్పుల వల్లే కేసులు పెరిగాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.