'ఉప్పెన' టీమ్ కు మెగా కానుక విలువ ఎంతంటే...!

23-02-2021 Tue 21:38
  • ఈ నెల 12న రిలీజైన ఉప్పెన
  • హీరోగా నటించిన చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్
  • ఉప్పెన విజయంతో చిరంజీవి ఆనందం
  • చిత్రబృందానికి సందేశంతో పాటు ఓ బొమ్మను పంపిన వైనం
  • బొమ్మ ఖరీదు రూ.83 వేలు!
Chiranjeevi gifts Ladro product to Uppena team

మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్ర విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 12న విడుదలైన ఉప్పెన చిత్రం సాధారణ ప్రేక్షకులనే కాదు ప్రముఖులను సైతం ఆకట్టుకుంటోంది. తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక హీరోహీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిల సంగతి సరేసరి. పొగడ్తల వర్షంలో తడిసిముద్దవుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి పంపిన ఖరీదైన కానుక చిత్రబృందం ఆనందాన్ని రెట్టింపు చేసింది.

చిరు రూ.83 వేల విలువ చేసే ఓ ప్రేమికుల బొమ్మను చిత్రయూనిట్ కు పంపారు. ఈ బొమ్మ పేరు 'ది థ్రిల్ ఆఫ్ లవ్ కపుల్ ఫిగరైన్'. దీన్ని స్పానిష్ సంస్థ లాడ్రో రూపొందించింది. ఈ బొమ్మలో ఓ యువతి, యువకుడు ప్రేమభావనతో ఒకర్నొకరు హత్తుకుని ఉంటారు. చిరంజీవి తన సందేశంతో పాటు ఈ బొమ్మను కూడా పంపి చిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు.