పింక్ బాల్ తో భారత్ 'సొంతగడ్డ ఆధిక్యత' చూపించాలంటే కష్టమే: ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యలు

23-02-2021 Tue 21:27
  • రేపు మొతేరాలో భారత్, ఇంగ్లండ్ డేనైట్ టెస్టు
  • పింక్ బాల్ తో టెస్టు మ్యాచ్
  • బంతి బాగా స్వింగ్ అవుతుందన్న మాంటీ పనేసర్
  • భారత్ ఆటతీరుపై పనేసర్ సందేహాలు
England former spinner Monty Panesar opines on pink ball

భారత్, ఇంగ్లండ్ మధ్య రేపు అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో డేనైట్ టెస్టు ప్రారంభం కానుంది. అయితే, సంప్రదాయ క్రికెట్ బంతికి భిన్నంగా పింక్ రంగులో ఉండే బంతిని డేనైట్ మ్యాచ్ ల్లో వినియోగిస్తారు. దీనిపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ స్పందించాడు. పింక్ రూపురేఖలు ఇరుజట్లకు సమాన అవకాశాలు కల్పించే విధంగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. సాధారణంగా ఆతిథ్య జట్లకు సొంతగడ్డ  ఆధిక్యత ఉంటుందని, కానీ పింక్ బాల్ తో అది సాధ్యం కాదని అన్నాడు. సొంతగడ్డ ఆధిక్యతను గులాబీరంగు బంతి తటస్థీకరిస్తుందని తెలిపాడు.

ఎర్రబంతి తరహాలో కాకుండా, ఇది ఓ దశలో బాగా స్వింగ్ అవుతుందని వెల్లడించాడు. గాలిలోనే దిశ మార్చుకుని రివర్స్ స్వింగ్ కూడా అవుతుందని పనేసర్ వివరించాడు. టీమిండియా సొంతగడ్డ ప్రభావాన్ని ఇది హరించివేస్తుందని పేర్కొన్నాడు. విపరీతంగా స్వింగ్ అయ్యే గులాబీ బంతిని చూసి భారత్ జడుసుకోకుండా ఉంటుందా? అనేది సందేహం కలిగిస్తోందని పనేసర్ తెలిపాడు. అందుకు ఇటీవలే అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టే నిదర్శనమని అన్నాడు. ఈ టెస్టులో భారత్ 36కే ఆలౌటైందని పనేసర్ గుర్తు చేశాడు. మొతేరాలో కూడా అదే తరహాలో పింక్ బాల్ స్వింగ్ అయితే మాత్రం అడిలైడ్ తరహా ఫలితంపై భారత్ ఆందోళన చెందే అవకాశాలున్నాయని వివరించాడు.