ఇప్పటికైనా జేసీ తన మాటలు ఆపకపోతే అనంతపురం ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి శంకర నారాయణ

23-02-2021 Tue 16:56
  • సీఎంపై జేసీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్న మంత్రి
  • జేసీ కుటుంబం గురించి తాడిపత్రి ప్రజలకు తెలుసని వెల్లడి
  • మత్తు దిగక మాట్లాడుతున్నారని వ్యంగ్యం
  • జానీవాకర్ రెడ్డిలా మారిపోయారంటూ వ్యాఖ్యలు
Minister Sankar Narayana fires on JC Diwakar Reddy

ఏపీ మంత్రి శంకర నారాయణ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ధ్వజమెత్తారు. దివాకర్ రెడ్డి కుటుంబం ఎంతటి అరాచకాలు చేసిందో తాడిపత్రి ప్రజలకు తెలుసని, అలాంటిది జేసీ సీఎం జగన్ పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

దివాకర్ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బు, ఆయన దౌర్జన్యాలు, హత్యలు అందరికీ తెలుసని, కానీ మత్తు దిగక ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. జానీ వాకర్ రెడ్డిలా మారిపోయారని ఎద్దేవా చేశారు.

బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీపై కేసులు నమోదయ్యాయని, అక్రమ గనుల తవ్వకంలో కోర్టులో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని మంత్రి శంకర నారాయణ వెల్లడించారు. అలాంటి వ్యక్తి సీఎం జగన్ రోజుకు రూ.300 కోట్లు సంపాదిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జేసీ ఇలాంటి మాటలు ఆపకపోతే అనంతపురం ప్రజలు నాలుక కోస్తారని హెచ్చరించారు.