తెలంగాణలో రేపటి నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు క్లాసులు

23-02-2021 Tue 16:19
  • తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభం 
  • సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిర్ణయం
  • మార్చి 1 లోపు క్లాసులు ప్రారంభించుకోవచ్చన్న సబిత
  • తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని వెల్లడి
Sabitha Indrareddy says parents nod must for students

తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. హైస్కూల్ స్థాయిలో 9, 10వ తరగతితో పాటు కాలేజీ స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యాసంస్థలు ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యాయి. తాజాగా 6, 7, 8 తరగతులకు కూడా క్లాసులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రేపటి నుంచి మార్చి 1 లోపు ఎప్పుడైనా క్లాసులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు.

అయితే, విద్యార్థులు పాఠశాలలకు వచ్చే అంశంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. స్కూలుకు వచ్చే విద్యార్థులు కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ తరగతుల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించారు.