సీబీఐ విచారణకు ముందు.. అభిషేక్​ ఇంటికి మమత

23-02-2021 Tue 13:50
  • పది నిమిషాలు మేనల్లుడు, అతడి భార్య రుజిరతో మంతనాలు
  • ఆమె వెళ్లిన కొన్ని నిమిషాలకే సీబీఐ అధికారుల ఎంట్రీ
  • బెదిరింపులకు లొంగే రకాలం కాదని మండిపడిన అభిషేక్
Mamata Banerjee Visits Nephews Home Ahead Of CBI Questioning His Wife

బొగ్గు గనుల ముడుపుల కుంభకోణానికి సంబంధించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరను సీబీఐ అధికారులు విచారించారు. సోమవారం నాడే రుజిరకు అధికారులు సమన్లు ఇవ్వగా.. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అందుబాటులో ఉంటానని ఆమె చెప్పారు.

‘‘నన్ను విచారించేందుకు గల కారణాలు నాకు తెలియదుగానీ.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎప్పుడైనా మీరు ఇంటికి రావొచ్చు’’ అని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మహిళా అధికారులు 8 మందితో కూడిన సీబీఐ బృందం.. ఆమె ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
 
అయితే, సీబీఐ విచారణకు ముందే మమత బెనర్జీ.. తన మేనల్లుడి ఇంటికి వెళ్లారు. పది నిమిషాల పాటు అభిషేక్, రుజిరతో మాట్లాడారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత కొద్ది సేపటికే సీబీఐ అధికారులు అభిషేక్ ఇంటికి వచ్చారు. కాగా, సీబీఐ దాడులపై అభిషేక్ స్పందించారు.

 రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే బీజేపీ నేతలు తమను టార్గెట్ చేశారని మండిపడ్డారు. తన భార్యకు సీబీఐ ఇచ్చిన నోటీసులను ట్వీట్ చేసి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వీటి ద్వారా తమను భయపెట్టాలని వారు అనుకుంటూ ఉండొచ్చని, కానీ, తాము వారి బెదిరింపులకు లొంగే రకాలం కాదని తేల్చి చెప్పారు.