భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు చిరుతపులితో పోరాడి చంపేసిన కర్ణాటక వ్యక్తి

23-02-2021 Tue 13:01
  • కర్ణాటకలో ఘటన
  • భార్య, కుమార్తెతో బైక్ పై వెళుతున్న వ్యక్తి
  • మార్గమధ్యంలో చిరుత దాడి
  • బైక్ పై నుంచి ముగ్గురు కిందపడిపోయిన వైనం
  • చిరుత దాడిలో ముగ్గురికీ గాయాలు 
Karnataka man killed leopard to save his wife and daughter

కర్ణాటకలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు చిరుతపులితో వీరోచితంగా పోరాడి దాన్ని అంతమొందించాడు. కర్ణాటకలోని హసన్ జిల్లా బెండాకెరె ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాజగోపాల్ నాయక్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి బైక్ పై వెళుతుండగా, అటవీప్రాంతంలో ఓ చిరుతపులి దాడి చేసింది. చిరుత ధాటికి బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది.

ఈ క్రమంలో ఆ చిరుత తన భార్య, కుమార్తెలను గాయపర్చడం చూసిన రాజగోపాల్ నాయక్ ప్రాణాలకు తెగించి ఆ చిరుతతో పోరాడాడు. తనకు గాయాలు అయినప్పటికీ భయపడకుండా ఆ చిరుతపులిని చంపేశాడు. చిరుత దాడిలో గాయపడిన రాజగోపాల్ తో పాటు అతడి భార్య, కుమార్తెలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.