వైసీపీతో పోటీ పడి డబ్బివ్వలేకనే తెలుగుదేశం ఓటమి: జేసీ దివాకర్ రెడ్డి

23-02-2021 Tue 11:47
  • జగన్ ఒకరోజు సంపాదన రూ. 300 కోట్లట
  • కుప్పం ప్రాంతాన్ని చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారు
  • డబ్బులు పంచలేకనే ఓడిపోయారన్న జేసీ
JC Diwakar reddy tells his Reason for TDP Defete in Latest Elections

డబ్బు ప్రభావంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తోందని, అభివృద్ధిని చూసి ప్రజలు అండగా ఉంటున్నారని ఆ పార్టీ నేతలు చేసుకుంటున్న ప్రచారం అవాస్తవమని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 ఈ ఉదయం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ ఒకరోజు ఆదాయం రూ. 300 కోట్లని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో వాస్తవం తనకు తెలియదని, ప్రజలు మాత్రం జగన్ సంపాదనపై చర్చించుకుంటున్నారని అన్నారు.

వాస్తవానికి కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంతో బాగా అభివృద్ధి చేశారని, అయినా, వైసీపీ ఇచ్చినంత డబ్బును ఇవ్వలేక ఓడిపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ధన బలానికి పోలీసులు కూడా తోడయ్యారని అన్నారు. అందుకే ఎన్నికల్లో జగన్ బ్యాచ్ అధిక విజయాలు సాధించిందన్నారు. చంద్రబాబు ఎటువంటి వ్యక్తో, జగన్ ఎటువంటి వ్యక్తో ప్రజలకు తెలుసునని కామెంట్ చేశారు.