Aadi Reshma: డ్రైవింగ్ లైసెన్స్ లేని స్నేహితురాలికి స్కూటీ ఇచ్చి... జైలుకెళ్లిన హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థి!

  • ఆది రేష్మకు స్కూటీ ఇచ్చిన స్నేహితుడు
  • ప్రమాదంలో దుర్మరణం పాలైన రేష్మ
  • ఏ1గా వాహన యజమాని పేరు చేర్చిన పోలీసులు
Police Arrested Friend Who Gives Scooty to Girl Friend

డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, ఒకవేళ ఇచ్చి, వారు ఏదైనా ప్రమాదానికి గురైతే, వాహనం యజమానిదే బాధ్యతని పోలీసులు ఎంతగా చెప్పినా వినని వారికి ఇది ఓ గుణపాఠాన్ని నేర్పే ఉదాహరణ. తన స్నేహితురాలికి వాహనాన్ని ఇచ్చిన ఓ హోటల్ మేనేజ్ మెంట్ స్టూడెంట్, ఇప్పుడు ఓ కేసులో ఏ1గా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే...

గత శుక్రవారం రాత్రి హైదరాబాదు కూకట్ పల్లిలో డెంటల్ విద్యార్థిని ఆది రేష్మ, ఓ స్కూటీని నడుపుతూ, రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర గాయాల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు రేష్మకు లైసెన్స్ లేదని, ఆ వాహనం అజయ్ సింగ్ (23) అనే స్టూడెంట్ దని గుర్తించారు. స్నేహితురాలే కదా అని అతను వాహనాన్ని ఇచ్చాడని, ఆ వాహనం లారీని ఢీకొనగా రేష్మ దుర్మరణం పాలైందని తెలిపారు.

ఈ కేసులో నిబంధనల ప్రకారం, అజయ్ సింగ్ ను ఏ1గా, లారీ డ్రైవర్ ను ఏ2గా పేర్కొన్నామని, అజయ్ సింగ్ ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించామని వెల్లడించారు. ఇకనైనా వాహనదారులు మారాలని, డ్రైవింగ్ నిబంధనలు ఇప్పుడు చాలా కఠినంగా అమలవుతున్నాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

More Telugu News