India: మార్చి తొలి వారంలో మినీ సంగ్రామం మొదలు... చూచాయగా చెప్పిన నరేంద్ర మోదీ!

  • 2016లో మార్చి 4న షెడ్యూల్ విడుదల
  • ఈ సంవత్సరం 7లోగా ఈసీ నిర్ణయం వెలువడే చాన్స్
  • అసోం పర్యటనలో నరేంద్ర మోదీ
Assembly Election Schedule by March 7 Hints Modi

నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మార్చి తొలివారంలోగా మినీ సంగ్రామం మొదలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చూచాయగా వెల్లడించారు. అసోంలో పర్యటిస్తున్న ఆయన, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ మార్చి 7లోగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

 అసోంతో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి వుందన్న సంగతి తెలిసిందే. "2016లో ఈ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మార్చి 4న విడుదలైంది. ఈ సంవత్సరం నా అంచనాల మేరకు మార్చి 7లోగా షెడ్యూల్ ను ఈసీ ప్రకటిస్తుంది" అని మోదీ వ్యాఖ్యానించారు.

కాగా, అసోం పర్యటన తరువాత బెంగాల్ లోని హుగ్లీ ప్రాంతానికి వెళ్లిన మోదీ అశోల్ పరివర్తన్ (నిజమైన మార్పు) పేరిట జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. వచ్చే నెలలో కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో నరేంద్ర మోదీ భారీ ర్యాలీని నిర్వహించనుండగా, అది ముగిసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఆరు పరివర్తన ర్యాలీలను నిర్వహించగా, ఇది అతిపెద్ద ర్యాలీ అని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

ఇక తన పర్యటనలో భాగంగా అసోంలోని సిలాపథార్ ప్రాంతంలో రూ. 3 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు ఇంధన మౌలిక ప్రాజెక్టులను నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో ఏడవ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం నిమిత్తం ధీమాజీ ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. ఎనిమిదవ కాలేజీగా గౌహతి సమీపంలోని సుల్ కుచ్చి సమీపంలో మరో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, రాష్ట్రాల అభివృద్ధి విషయాన్ని ఏ మాత్రమూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక్కడి ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకునేందుకే కేంద్ర మంత్రులు తరచూ పర్యటిస్తున్నారని, తాను కూడా పలుమార్లు వచ్చి వెళ్లానని గుర్తు చేశారు.

More Telugu News