EL Chapo: మెక్సికో 'డ్రగ్స్ లార్డ్' ఎల్ చాపో భార్య యూఎస్ లో అరెస్ట్!

  • 30 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న ఎల్ చాపో
  • డుల్లెస్ ఎయిర్ పోర్టులో ఎమ్మా కొరోనెల్ అరెస్ట్
  • ఫెడరల్ కోర్టులో హాజరు పరచనున్న అధికారులు
Drug Lord El Chapo Wife Emma Arrested in US

మెక్సికోలో మాదక ద్రవ్యాల బడా వ్యాపారిగా గుర్తింపు తెచ్చకుని, సినోలా డ్రగ్ కార్డెల్ లో అరెస్ట్ అయి, ప్రస్తుతం జైల్లో ఉన్న జావోక్విన్ ఎల్ చాపో గుజ్మాన్ భార్య ఎమ్మా కొరోనెల్ ఇస్పురో (31)ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా ముఠాలో భాగంగా పని చేస్తూ, అమెరికాలోకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో నార్త్ వర్జీనియా పరిధిలోని డుల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. వాషింగ్టన్ లోని ఫెడరల్ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నట్టు అధికారులు తెలిపారు.

కాగా, కొరేనెల్ వాషింగ్టన్ ప్రాంతానికి ఎందుకు వచ్చారన్న విషయమై స్పష్టత లేదు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం తన భర్త ఎల్ చాపో పై కోర్టులో విచారణ జరుగుతున్న వేళ, ఆమె తరచూ అమెరికాకు ప్రయాణించి, విచారణకు హాజరయ్యే వారు. జూలై 2019లో ఎల్ చాపోపై వచ్చిన అభియోగాలు నిర్ధారణ కావడంతో న్యాయస్థానం 30 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. డ్రగ్స్ సరఫరాలో తనకు ఎదురువచ్చే వారిని అతను దారుణంగా చంపేసేవాడని నాటి విచారణలో రుజువైంది.

అంతకుముందు 2015లో మెక్సికోలోని అల్టిప్లానో జైలు నుంచి ఎల్ చాపో తప్పించుకోగా, అది పెను సంచలనమైంది. ఎల్ చాపోను తప్పించడంలో కరోనెల్ కూడా సహకరించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. తన జైలు గది నుంచి దాదాపు మైలు దూరం పాటు సొరంగాన్ని తవ్విన ఎల్ చాపో, అప్పట్లో తప్పించుకుని, ఆపై అమెరికాలో పట్టుబడ్డాడు. భర్త వ్యాపార బాధ్యతలను చేపట్టిన కరోనెల్, అమెరికాకు డ్రగ్స్ తరలిస్తున్నట్టు ప్రాసిక్యూషన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఈ విషయంలో స్పందించిన ఓ మెక్సికో అధికారి, తామేమీ ఆమె అరెస్ట్ ను కోరలేదని, అమెరికా వద్ద ఆమెకు వ్యతిరేకంగా ఏ ఆధారాలు ఉన్నాయో ఇంకా తెలియరాలేదని వెల్లడించడం గమనార్హం. ఇదిలావుండగా, 18 ఏళ్ల వయసులో బ్యూటీ క్వీన్ గా ఎంపికైన కరోనెల్ ను 2007లో ఎల్ చాపో పెళ్లి చేసుకున్నాడు.

More Telugu News