పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బంగారు నగలతో వెళ్తున్న నరసరావుపేట వ్యాపారుల దుర్మరణం

23-02-2021 Tue 10:12
  • మల్యాలపల్లి మూలమలుపు వద్ద బోల్తాపడిన కారు
  • అక్కడికక్కడే మృతి చెందిన వ్యాపారులు
  • రూ. కోటి నగలను గుర్తించి పోలీసులకు అప్పగించిన 108 సిబ్బంది
Guntur dist jewellery business men died in car accident in peddapalli

కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యాపారులు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేటకు చెందిన కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబు బంగారు వ్యాపారులు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని బంగారు దుకాణాల్లో బంగారం విక్రయిస్తుంటారు. బంగారు నగలతో వీరు తెలంగాణకు రాగా, ఈ ఉదయం వారు ప్రయాణిస్తున్న కారు రామగుండం రాజీవ్ రహదారిపై మల్యాలపల్లి మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది.

ఈ ఘటనలో శ్రీనివాస్, రాంబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న సంతోష్ కుమార్, సంతోష్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు వీరివద్ద కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆభరణాలను గుర్తించి రామగుండం ఎస్ఐ శైలజకు అప్పగించారు.