Hyderabad: బస్సులో పారిపోయిన నిందితులను విమానంలో వెళ్లి అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు!

  • వాక్స్ బేకరీలో దొంగతనం
  • కోల్ కతా పారిపోతున్నట్టు గుర్తించిన పోలీసులు
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు 
  • రూ. 4.50 లక్షల రికవరీ
Accused in Bus and Police Chage in Flight

హైదరాబాద్ లోని ఓ బేకరీలో భారీ ఎత్తున నగదు దోచుకుని కోల్ కతాకు బస్సులో పారిపోతున్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు, విమానంలో వెళ్లి, వారిని అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, గత వారం జూబ్లీహిల్స్ పరిధిలోని వాక్స్ బేకరీలో రూ. 7 లక్షల నగదు చోరీ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన బేకరీ యజమాని అమర్ చౌదరి పోలీసులను ఆశ్రయించి, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సోహిదుల్ అస్లాం మీద అనుమానాన్ని వ్యక్తం చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా, సోహిదుల్ ప్రధాన నిందితుడని, అతనికి ఎల్బీ నగర్ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న అలీముద్దీన్ తో పాటు అక్సెదుల్ అలీ సహకరించారని గుర్తించారు. వీరు పక్కా ప్లాన్ తో నగదును చోరీ చేశారని తెలుసుకుని, వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేయగా, వీరంతా బస్సులో కోల్ కతా వెళుతున్నట్టు తేలింది.

ఆ వెంటనే పోలీసులు, కోల్ కతాకు విమానంలో బయలుదేరారు. పశ్చిమ బెంగాల్ పోలీసులకు విషయం చెప్పి, వారు ప్రయాణిస్తున్న మార్గం వివరాలను తెలిపారు. కోల్ కతాలో దిగిన జూబ్లీహిల్స్ స్పెషల్ టీమ్ బృందం, నిందితులు బస్సులో ఉండగానే గుర్తించి, అరెస్ట్ చేశారు. వారు దొంగిలించిన సొత్తులో రూ. 4.50 లక్షలు రికవరీ చేశామని, ముగ్గురినీ రిమాండ్ కు తరలించామని వెల్లడించారు.

More Telugu News