రెండు రోజుల బ్రేక్ తరువాత... నేడు మళ్లీ పెరిగిన పెట్రోలు ధర!

23-02-2021 Tue 09:30
  • ఇటీవల వరుసగా 12 రోజులు పెరిగిన ధర
  • నేడు లీటరు పెట్రోలుపై 36 పైసల వడ్డన
  • సుంకాలు తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి
Petrol Price Hike after 2 Days

రోజువారీ పెట్రోలు ధరల పెరుగుదల నిలిచిపోయిందన్న ఆనందం ముచ్చటగా మూడు రోజులైనా మిగల్లేదు. ఇటీవల వరుసగా 12 రోజుల పాటు పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధర, రెండు రోజుల విరామం తరువాత, మంగళవారం నాడు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలుపై 36 పైసల వరకు, డీజిల్ పై 38 పైసల వరకూ ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఉదయం ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 90.93కు చేరగా, డీజిల్ ధర రూ. 81.32కు పెరిగింది.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, లీటరు పెట్రోలు ధర రూ. 94.54కు డీజిల్ ధర రూ. 88.69కి చేరింది. బెంగళూరులో పెట్రోలు ధర రూ. 93.98కి, డీజిల్ ధర రూ. 86.21కి చేరింది. గడచిన 54 రోజుల్లో 25 సార్లు ధరలు పెరగడంపై ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. మరోవైపు విపక్షాలు నరేంద్ర మోదీ సర్కారుపై మండిపడుతున్నాయి. ప్రజల జేబులను కొల్లగొట్టే విషయంలో మోదీ ప్రభుత్వం బహు చక్కగా పని చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు.

కాగా, ఈ విషయంలో తాము చేయగలిగింది ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తుండటం గమనార్హం. తమ లాభాలను పెంచుకునేందుకు క్రూడాయిల్ ను వెలికితీస్తున్న ఒపెక్ దేశాలు ప్రొడక్షన్ కోతను అమలు చేస్తున్నాయని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆ కారణంగానే ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయని అన్నారు. ఒపెక్ దేశాలు ఉత్పత్తిని పెంచితే, ధరలు తగ్గుతాయని అన్నారు. పెట్రో ధరల భారాన్ని కొంతైనా తగ్గించేలా పన్నులను ఉపసంహరించుకోవాలని పలు వర్గాల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తమ పరిధిలోని సుంకాలను తగ్గించిన సంగతి తెలిసిందే.