అవినీతిలో కూరుకుపోయిన తమిళనాడు రాష్ట్రానికి విముక్తి కల్పించాలి.. రాజకీయాల్లోకి వస్తున్నా: మాజీ ఐఏఎస్ సహాయం

23-02-2021 Tue 08:36
  • మధురై కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అక్రమ క్వారీలపై ఉక్కుపాదం
  • 29 ఏళ్లపాటు నిజాయతీగా, నిర్భయంగా పనిచేశానన్న సహాయం
  • యువత ఒత్తిడితోనే రాజకీయాల్లోకన్న మాజీ కలెక్టర్

అవినీతి ఊబిలో కూరుకుపోయిన తమిళనాడు రాష్ట్రాన్ని దానిని నుంచి బయటపడేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి వి.సహాయం ప్రకటించారు. గతంలో మధురై జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో మైనింగ్ క్వారీ సంస్థలు, ప్రభుత్వ క్వారీలలో జరిగిన గ్రానైట్ అక్రమ తవ్వకాలపై ఆయన ఉక్కుపాదం మోపారు.

సహాయం గతేడాది స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా, ఆ వార్తలకు తెరదించుతూ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. 29 ఏళ్లపాటు నిజాయతీగా ప్రజలకు సేవలు అందించానని, ఈ క్రమంలో ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో అవినీతి రహిత పాలన కష్టమన్న ఆయన రాజకీయాల్లోకి వస్తే తన నిజాయతీకి ఎక్కడ భంగం కలుగుతుందో అన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లు దానికి దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే, యువత నుంచి ఒత్తిడి పెరగడంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, ఆయన సొంతంగా పార్టీ పెడతారా? లేక, ఏదైనా పార్టీలో చేరుతారా? అన్న విషయంలో స్పష్టత లేదు.