VLSRSAM: ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి క్షిపణి పరీక్ష సక్సెస్

  • చాందీపూర్‌లోని ఐటీఆర్ నుంచి పరీక్ష
  • పరీక్షకు ముందు సురక్షిత ప్రాంతాలకు 6 వేల మంది తరలింపు
  • అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాల ఛేదన
VLSRSAM Missile Successfully Test Fired

ఇటీవల వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న భారత్ తాజాగా ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి నిన్న ఈ పరీక్షను నిర్వహించింది. స్వల్ప శ్రేణి క్షిపణి అయిన దీనికి సంబంధించి నిట్టనిలువు ప్రయోగ వెర్షన్ (వీఎల్-ఎస్ఆర్‌శామ్)ను రెండుసార్లు విజయవంతంగా పరీక్షించింది. వెర్టికల్ లాంచర్ నుంచి దీనిని ప్రయోగించారు.

నేవీ అవసరాల నిమిత్తం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని అభివృద్ధి చేశారు. ఇది రెండుసార్లూ పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించినట్టు అధికారులు తెలిపారు. మరిన్ని పరీక్షల అనంతరం దీనిని యుద్ధ నౌకల్లో మోహరించనున్నట్టు చెప్పారు. కాగా, క్షిపణి పరీక్షకు ముందు ప్రయోగ వేదిక చుట్టూ ఉన్న రెండున్నర కిలోమీటర్ల పరిధిలోని ఐదుగ్రామాలకు చెందిన 6,322 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

More Telugu News