వైసీపీ స్థానిక నేతలపై రోజా ఆగ్రహం.. ఐదుగురిపై వేటేసిన అధిష్ఠానం

23-02-2021 Tue 07:57
  • నగరి నియోజకవర్గంలో ఘటన
  • పార్టీ అభ్యర్థుల ఓటమికి కృషి చేశారని ఆరోపణ
  • పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వేటు
5 local leaders suspended from ycp in Nagari

పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా, సొంతపార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఐదుగురు స్థానిక నేతలపై వైసీపీ వేటేసింది. వైసీపీ నేత, ఎమ్మెల్యే రోజా నియోజకవర్గమైన నగరి పరిధిలోని తడుకుకు చెందిన ముప్పాళ్ల రవిశేఖర్ రాజా, వై.బొజ్జయ్యలను పార్టీ నుంచి తొలగించింది. అలాగే, కేబీఆర్ పురానికి చెందిన తోటి ప్రతాప్, తొర్రూరు పంచాయతీకి చెందిన ఎం.కిశోర్ కుమార్, గుండ్రాజు కుప్పం హరిజనవాడకు చెందిన రాజాలను అధిష్ఠానం సస్పెండ్ చేసింది.

సర్పంచ్ ఎన్నికల్లో సొంతపార్టీ అభ్యర్థులను ఓడించేందుకు వీరంతా ప్రయత్నించారని, అందుకనే వారిపై వేటేసినట్టు ఎమ్మెల్యే రోజా తెలిపారు. వీరెవరూ ఇకపై పార్టీ జెండాలను కానీ, గుర్తులను కానీ పట్టుకోవడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వీరిపై వేటేయడం గమనార్హం.