ట్రాక్టర్ కమానుకట్టలతో కత్తుల తయారీ... వామనరావు దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్ట్

22-02-2021 Mon 21:10
  • సంచలనం సృష్టించిన వామనరావు దంపతుల హత్య
  • ఈ కేసులో ఇప్పటికే ముగ్గురి అరెస్ట్
  • తాజాగా నాలుగో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆయుధాలు, వాహనాలు సమకూర్చిన బిట్టు శ్రీను
  • వామనరావుతో బిట్టు శ్రీనుకు విభేదాలు
  • బిట్టు శ్రీను, కుంట శ్రీను స్నేహితులన్న ఐజీ
Police arrest Bittu Srinu in Vamanarao couple murder case

పెద్దపల్లి అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యలో ఇప్పటివరకు కుంట శ్రీను, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ లను అరెస్ట్ చేయగా, తాజాగా నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును కూడా అరెస్ట్ చేశారు. ఇంతకుముందే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు, ఈ కేసులో అతడు కుట్రదారుడు అని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ హత్యోదంతంలో బిట్టు శ్రీను పాత్ర ఏంటన్నది ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు.

హైకోర్టు అడ్వొకేటు వామనరావుతో బిట్టు శ్రీనుకు కూడా విరోధం ఉందని, అందుకే కుంట శ్రీనుతో చేయి కలిపాడని వివరించారు. బిట్టు శ్రీను ఆధ్వర్యంలో పనిచేసే పుట్ట లింగమ్మ ట్రస్టు కార్యకలాపాలను అడ్డుకునే రీతిలో వామనరావు ఫిర్యాదులు చేయడమే కాకుండా, ఆదాయానికి గండికొట్టే రీతిలో వ్యవహరిస్తుండడంతో బిట్టు శ్రీను కక్ష పెంచుకున్నాడని తెలిపారు. మంథని మున్సిపాలిటీ కింద నడుపుతున్న తన ట్రాక్టర్ ను కాంట్రాక్టు నుంచి తొలగించడంతో ఆదాయ వనరు కోల్పోవడం బిట్టు శ్రీనును ఆగ్రహానికి గురిచేసింది.

ఇక, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీను... బిట్టు శ్రీనుకు స్నేహితుడేనని పేర్కొన్నారు. "ఇద్దరూ మద్యం తాగే సమయంలో వామనరావు గురించి మాట్లాడుకున్నారు. తన ఆదాయాన్ని ఎలా దెబ్బతీశాడో బిట్టు శ్రీను చెప్పగా, తాను పంచాయతీ అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నానంటూ ఓ నోటీసును ఫ్లెక్సీగా తయారుచేయించి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడని కుంట శ్రీను తన గోడు వెళ్లబోసుకున్నాడు. దాంతో తన పరువు పోయిందని కుంట శ్రీను వాపోయాడు. పైగా ఆలయ నిర్మాణం విషయంలోనూ వామనరావు అడ్డుతగులుతున్న వైనాన్ని బిట్టు శ్రీనుకు తెలిపాడు. దాంతో వామనరావును అడ్డుతొలగించుకోవాలన్న పథకరచనకు బీజం పడింది.

ఈ క్రమంలో బిట్టు శ్రీను ట్రాక్టరు కమానుకట్టలతో రెండు కత్తులను తయారుచేయించాడు. మంథని కోర్టుకు దగ్గర్లోనే వామనరావును చంపాలని ప్లాన్ చేసినా వీలు కాలేదు. ఇంటికి సమీపంలో అంతమొందించాలని భావించినా, ఆ ప్లాన్ కూడా సాధ్యం కాలేదు. చివరికి కల్వచర్ల వద్ద శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ సాయంతో వామనరావు దంపతులను హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు పారిపోయేందుకు బిట్టు శ్రీనే వాహనాలు సమకూర్చాడు. వారిని మహారాష్ట్ర వెళ్లాలని చెప్పి తాను ఏమీ తెలియనట్టు ఇంటి వద్దే ఉన్నాడు" అని ఐజీ వివరించారు.