నామినేషన్ ఫారం సరైన ఫార్మాట్లో లేదన్న అధికారులు.... రేపు మళ్లీ నామినేషన్ వేయనున్న పీవీ కుమార్తె

22-02-2021 Mon 17:53
  • తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
  • పీవీ కుమార్తెకు టికెట్ ఇచ్చిన టీఆర్ఎస్
  • బీ-ఫారం అందజేసిన సీఎం కేసీఆర్
  • నామినేషన్ కు అడ్డంకులు.. వెనుదిరిగిన వాణీదేవి 
TRS candidate Surabhi Vanidevi returns without files her nomination in Telangana graduate mlc elections

దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుండడం తెలిసిందే. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆమెకు సీఎం కేసీఆర్ బీ-ఫారం అందించారు. అయితే నామినేషన్ వేసేందుకు ఎంతో ఉత్సాహంతో వెళ్లిన వాణీదేవికి నిరాశ ఎదురైంది. నామినేషన్ పత్రాలు సరైన ఫార్మాట్లో లేవని అధికారులు తిరస్కరించారు. అప్పటికే సమయం మించిపోవడంతో వాణీదేవి నిరాశతో వెనుదిరిగారు. దాంతో ఆమె రేపు ఉదయం నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు.

కాగా, పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్ఎస్ పై భగ్గుమంటున్నారు. ఓడిపోయే స్థానంలో అవకాశం ఇచ్చి పీవీ కుటుంబాన్ని అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు.