Revanth Reddy: కేసీఆర్ కుట్రను పీవీ కుమార్తె తెలుసుకోవాలి: రేవంత్ రెడ్డి

  • తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
  • పీవీ కుమార్తె సురభి వాణీదేవికి టీఆర్ఎస్ తరఫున టికెట్
  • కేసీఆర్ నిర్ణయంపై కాంగ్రెస్ నేతల విమర్శలు
  • గెలవలేని స్థానంలో టికెట్ ఇచ్చారని వ్యాఖ్యలు
  • గవర్నర్ కోటా ఇవ్వొచ్చు కదా అన్న రేవంత్ రెడ్డి
  • రాజకీయ లబ్దికోసమేనంటూ పొన్నం ఆరోపణ
Congress leaders questions CM KCR decision after gave a chance to PV daughter in MLC elections

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి సీఎం కేసీఆర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ, పీవీ కుటుంబానికి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఓడిపోయే సీటు పీవీ కుమార్తెకా? అని ప్రశ్నించారు. ఆమెను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయొచ్చు కదా! అని అన్నారు. కేసీఆర్ కుట్రను పీవీ కుమార్తె తెలుసుకోవాలని సూచించారు.

అటు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాజకీయ లబ్ది కోసమే పీవీ కుమార్తెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని ఆరోపించారు. పీవీ నరసింహారావును గౌరవిస్తూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకోవాలని మంత్రి తలసాని సూచిస్తున్నారని, పీవీపై నిజంగా అభిమానం ఉంటే ఆయన కుమార్తెకు రాజ్యసభ సీటు కానీ, గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీ అవకాశం కానీ ఇవ్వాలని అన్నారు. గెలవలేని స్థానంలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి ఆ కుటుంబాన్ని అవమానించే ప్రయత్నం చేయొద్దని పొన్నం హితవు పలికారు.

బీజేపీ నేతలు స్పందిస్తూ సురభి వాణీదేవిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలిపశువును చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News