అదే జరిగుంటే వైసీపీ ఇప్పటికే పతనమయ్యేది: చంద్రబాబు

22-02-2021 Mon 15:12
  • వైసీపీ పతనం ప్రారంభమైంది
  • ఆ పార్టీని ఎవరూ కాపాడలేరు
  • పోలీసులు ఉంటేనే వైసీపీ నేతలు ప్రతాపం చూపుతారు
If that happened YSRCP would have collapsed now says Chandrababu

రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పతనానికి ఇది ఆరంభం మాత్రమేనని... ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని చెప్పారు. దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని అన్నారు.

పంచాయతీ ఎన్నికలు సక్రమంగా, ప్రశాంతంగా జరిగి ఉంటే టీడీపీకి మరో 10 శాతం ఫలితాలు పెరిగేవని చంద్రబాబు చెప్పారు. అదే జరిగి ఉంటే వైసీపీ ఇప్పుడే పతనమై ఉండేదని అన్నారు. అధికార దుర్వినియోగంపై ఆధారపడి వైసీపీ ఎక్కువ శాతం స్థానాలను గెలుచుకుందని చెప్పారు. పోలీసులు ఉంటేనే వైసీపీ నేతలు ప్రతాపం చూపుతారని ఎద్దేవా చేశారు. తప్పుడు కేసులు పెట్టి ఓట్లు వేయించుకోవడం ప్రజాస్వామ్యమా? అని దుయ్యబట్టారు.

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని చంద్రబాబు ప్రశంసించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పోరాటం చేశారని అన్నారు. అన్ని చోట్లా ఏకగ్రీవాలు చేసుకోవాలనుకున్న వైసీపీ కుట్రలు సాగలేదని చెప్పారు. కొత్తవలసలో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థికి 250 ఓట్ల మెజార్టీ వచ్చినా రీకౌంటింగ్ కోరతారా? అని మండిపడ్డారు. టీడీపీ గెలిస్తే రీకౌంటింగ్ చేస్తారని... వైసీపీ గెలిచిన చోట రీకౌంటింగ్ చేయరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.