పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సీఎం జగన్

22-02-2021 Mon 15:00
  • ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు
  • అత్యధిక స్థానాల్లో వైసీపీ మద్దతుదారుల విజయం
  • విజయానికి కృషి చేశారంటూ పెద్దిరెడ్డిని ప్రశంసించిన సీఎం
  • సీఎంపై ప్రజల్లో నమ్మకమే విజయానికి కారణమన్న పెద్దిరెడ్డి
AP CM Jagan appreciates minister Peddireddy for Panchayat polls results

ఏపీలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మెరుగైన ఫలితాలు సాధించారంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం జగన్ అభినందించారు. అత్యధిక స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచేలా కృషి చేశారంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు మంత్రి పెద్దిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల హామీలు నెరవేర్చడం, సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే విజయానికి కారణాలు అని పెద్దిరెడ్డి వివరించారు.

మంత్రి పెద్దిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలో 13,095 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 10,524 పంచాయతీలు వైసీపీ మద్దతుదారుల కైవసం అయ్యాయి. టీడీపీకి 2,063 పంచాయతీలు దక్కాయి. కాగా, పంచాయతీ ఎన్నికలు సాఫీగా జరిగుంటే 90 శాతం స్థానాలు వైసీపీ మద్దతుదారులే విజయం సాధించేవారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.