ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల జగన్ పై ప్రజలకు నమ్మకం బాగా పెరిగింది: మంత్రి పెద్దిరెడ్డి

22-02-2021 Mon 14:41
  • పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి 15.75 శాతం మాత్రమే వచ్చాయి
  • జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేశారు
  • టీడీపీ దౌర్జన్యాలు చేసినా కుప్పంలో గెలవలేకపోయింది 
Jagan has good name at national level says Peddireddi

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 15.75 శాతం స్థానాలు మాత్రమే వచ్చాయని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. 50 శాతం స్థానాలను కైవసం చేసుకున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు నాలుగు విడతలలో జరగ్గా... అన్ని విడతలలో వైసీపీకి మెజార్టీ వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధిని చూసి గ్రామీణ ఓటర్లు వైసీపీకి ఓటు వేశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల జగన్ పై ప్రజలకు నమ్మకం అమాంతం పెరిగిందని చెప్పారు.

పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో కూడా వస్తాయని పెద్దిరెడ్డి అన్నారు. ఇప్పటి కంటే ఎక్కువ మెజార్టీని సాధించడానికి కృషి చేస్తామని చెప్పారు. జగన్ ప్రతిరోజు నిబద్ధతతో శాఖల సమీక్షలను నిర్వహిస్తున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో జగన్ కు చాలా మంచి పేరు ఉందని చెప్పారు. రోజుకు 18 గంటలు పని చేసినట్టు చంద్రబాబు చెప్పేవారని... ఎక్కడ, ఎప్పుడు, ఏం పని చేశారో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. కుప్పంలో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని... అయినా, వైసీపీ గెలుపును అడ్డుకోలేకపోయిందని అన్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే వైసీపీ ఓట్ల శాతం మరింత పెరిగేదని చెప్పారు.