బీజేపీలో చేరనున్న పరుగుల రాణి పీటీ ఉష.. వేడెక్కుతున్న కేరళ రాజకీయం!

22-02-2021 Mon 12:33
  • కమ్యూనిస్టు కంచుకోటపై కన్నేసిన బీజేపీ
  • కేరళ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ
  • బీజేపీకి అనుకూలంగా గళాన్ని వినిపిస్తున్న పీటీ ఉష
PT Usha to join BJP

పలు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. దేవతలు కొలువుండే భూమిగా పేరుగాంచి కేరళ కూడా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వేడెక్కింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంపై బీజేపీ గురి పెట్టడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరోవైపు కేరళ నుంచే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కమ్యూనిస్టులకు బలమైన కోటగా ఉన్న కేరళపై కాషాయ నేతలు, కాంగ్రెస్ పార్టీ కన్నేయడంతో, పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన శ్రీధరన్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో బీజేపీ క్యాడర్ లో కొత్త ఊపు వచ్చింది. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే సీఎం అభ్యర్థిగా తాను బరిలోకి దిగేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. మరోవైపు పరుగుల రాణిగా మన దేశ కీర్తి ప్రతిష్టలను చాటిన పీటీ ఉష కూడా బీజేపీలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

పీటీ ఉష ఇప్పటికే బీజేకీ అనుకూలంగా తన గళాన్ని వినిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఆమె మద్దతు పలుకుతున్నారు. నిరసనలు చేపట్టిన రైతులకు మద్దతుగా అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ఖండించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్లు చేశారు. అయితే, తాను బీజేపీలో చేరుతున్నట్టు ఉష ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు, ఈ వార్తలపై స్పందించేందుకు ఆమె సన్నిహిత వర్గాలు కూడా నిరాకరించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కేరళకు చెందిన పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులను బీజేపీ ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది.