నా 'ఎయిర్ ఫోర్స్ వన్' ఎక్కి ఇంటికెళ్లండి... అంటూ నాడు కిమ్ జాంగ్ ఉన్ కు ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్!

22-02-2021 Mon 11:57
  • రెండేళ్ల క్రితం హనోయిలో చర్చలు
  • తొలుత వాగ్యుద్ధం, ఆపై స్నేహ పూర్వకం
  • ట్రంప్ ఆఫర్ ను తిరస్కరించిన కిమ్
Trump Offer Lift in air force one for Kim Jong Un two years Back

తాను అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హనోయిలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తో సమావేశమైన వేళ, తన ఎయిర్ ఫోర్స్ వన్ లో ఇంటికి వెళ్లాలని ఆయనకు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ ఇచ్చారట. దాదాపు రెండేళ్ల క్రితం వీరిద్దరి మధ్యా శిఖరాగ్ర చర్చలు జరుగగా, నాడు సంభవించిన ఈ ఆసక్తికర అంశాన్ని బీబీసీ వార్తా సంస్థ తన కొత్త డాక్యుమెంటరీలో ప్రస్తావించింది.

నాటి సమావేశంలో తొలుత వీరిద్దరి మధ్యా తీవ్ర వాదోపవాదాలతో కూడిన వాగ్యుద్ధం జరిగిందని, ఇద్దరూ దాడులు, ప్రతిదాడులపై హెచ్చరికలు చేసుకున్నారని ఈ డాక్యుమెంటరీ పేర్కొంది. ఆపై ఇద్దరూ స్నేహపూర్వక, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోకి వచ్చారని, ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్నారని తెలిపింది.

ఈ సమావేశం చివరిలో ట్రంప్ నుంచి ఏ దేశాధినేతకూ రాని ఆఫర్ ను కిమ్ ముందు ఉంచారని, అమెరికా దేశాధ్యక్షులకు మాత్రమే పరిమితమైన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వియత్నాం నుంచి ఉత్తర కొరియాకు లిఫ్ట్ ఇస్తానని ట్రంప్ చెప్పారని, ఆ విమానంలో ఇంటికి చేరుకోవాలని సూచించారని బీబీసీ పేర్కొంది. అయితే, ఈ ఆఫర్ ను కిమ్ సున్నితంగా తిరస్కరించారని పేర్కొంది. ఒకవేళ కిమ్ ఈ ఆఫర్ ను అంగీకరించివుంటే, ఎన్నో రకాల సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తి వుండేవని అంచనా వేసింది.

ఇక వీరిద్దరి మధ్యా వచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్ లో లిఫ్ట్' అంశాన్ని ట్రంప్ జాతీయ భద్రతా కౌన్సిల్ ఆసియా ప్రతినిధి మ్యాథ్యూ పాటింగర్ స్వయంగా వెల్లడించారని కూడా బీబీసీ పేర్కొంది. 2018లో కిమ్, ట్రంప్ మధ్య తొలి విడత చర్చలు సింగపూర్ లో జరుగగా, ఆ సమయంలో ఎయిర్ చైనా విమానంలో కిమ్ అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో తాను ప్రయాణించే 'దీ బీస్ట్' కారులోకి కిమ్ ను తీసుకుని వెళ్లిన ట్రంప్, దానిలోని విశేషాలను స్వయంగా వివరించారు.