ఏపీ పంచాయతీ ఎన్నికలు విజయవంతం: ఎస్ఈసీ నిమ్మగడ్డ

22-02-2021 Mon 11:03
  • సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
  • 16 శాతం మాత్రమే ఏకగ్రీవం
  • 50 శాతం స్థానాల్లో మహిళలు, బడుగులు గెలిచారు
  • ఇదే ఉత్సాహంతో మునిసిపల్ ఎన్నికలు
  • ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
AP Gram Panchayat Elections Success Says Nimmagadda

ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అందించిన సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతం అయ్యాయని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలను కూడా జరపాలని నిర్ణయించామని, ఉద్యోగులు అందుకు సిద్ధం కావాలని, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఎప్పటికప్పుడు సరైన సూచనలు చేశారని కితాబునిచ్చారు. కోర్టు పరిధిలో ఒకటి, రెండు అంశాలు ఉన్నందున కొన్ని చోట్ల ఎన్నికలు జరపలేకపోయామని వెల్లడించిన నిమ్మగడ్డ, కేసులు పరిష్కారం కాగానే వాటికీ ఎన్నికలు జరుపుతామని స్పష్టం చేశారు. మునిసిపల్ ఎన్నికలకు మాత్రం ఎటువంటి అవరోధాలూ లేవని అన్నారు.

ఈ పంచాయతీ ఎన్నికల్లో 16 శాతం మాత్రమే ఏకగ్రీవం అయ్యాయని, మిగతా చోట్ల పోలింగ్ నిర్వహించి, ఫలితాలను వెల్లడించామని తెలిపారు. 50 శాతం మంది మహిళలు, బలహీన వర్గాలకు చెందిన వారు విజయం సాధించారని అన్నారు. 10,890 మంది సర్పంచ్ లు నేరుగా ఎన్నికయ్యారని నిమ్మగడ్డ పేర్కొన్నారు.

సాధారణ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిందని, 80 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం శుభ పరిణామమని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల నుంచి కూడా ఇదే విధమైన స్పందన వస్తుందని భావిస్తున్నట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఓటు వేయడం తమ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ స్లిప్ ల పంపిణీని నేడో, రేపో ప్రారంభించనున్నామని, ప్రతి ఒక్కరికీ కనీసం రెండు, మూడు రోజుల ముందుగానే స్లిప్ లను అందిస్తామని హామీ ఇచ్చారు.

గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లోనే ఇప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అందరికీ తెలిసిన ప్రాంతాల్లోనే ఇవి ఉంటాయి కాబట్టి, పట్టణ ఓటర్లు తమ వంతు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిమ్మగడ్డ కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యఎప్పుడైనా వచ్చి ఓటేసి వెళ్లాలని అన్నారు.