Tamilnadu: తమిళనాడులో పర్యటించిన తేజస్వీ సూర్య... డీఎంకేపై తీవ్ర విమర్శలు!

  • సేలంలో బీజేపీ యూత్ వింగ్ సమావేశాలు
  • పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్, తేజస్వీ సూర్య
  • తమిళనాడు ఓ పవిత్ర భూమి
  • డీఎంకేలో మాత్రం హిందుత్వ వ్యతిరేకత
  • నిప్పులు చెరిగిన తేజస్వీ
Tejaswi Surya Comments on DMK in BJP Youth Wing Meeting in Selam

తమిళనాడులో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే అమిత్ షా, రాహుల్ గాంధీ వంటి జాతీయ పార్టీల నేతలు రాష్ట్రంలో పర్యటించి, తమతమ పార్టీల క్యాడర్ ను ఉత్సాహపరిచారు. స్థానిక పార్టీలైన ఏఐఏడీఎంకే, డీఎంకే మధ్యే ప్రధాన పోటీ నడవనుండగా, ఆ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు.

తాజాగా, సేలంలో బీజేపీ యూత్ వింగ్ సమావేశాలు జరుగగా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తేజస్వి ప్రసంగిస్తూ, డీఎంకే పార్టీపై సంచలన విమర్శలు చేశారు. "డీఎంకే మంచి మార్గంలో నడవడం లేదు. దాని సిద్ధాంతాలు హిందూ వ్యతిరేకం. ప్రతి తమిళ వ్యక్తీ తాను హిందువునని గర్విస్తాడు. ఇది ఓ పవిత్రమైన భూమి. దేశంలోనే ఎక్కడా లేనన్ని దేవాలయాలు ఈ గడ్డపై ఉన్నాయి. కానీ డీఎంకే మాత్రం హిందుత్వ వ్యతిరేకతను నింపుకుంది. ఆ పార్టీని ఓడించాలి" అని పిలుపునిచ్చారు.

బీజేపీ మాత్రమే దేశంలోని అన్ని ప్రాంతాలనూ సరిసమానంగా చూస్తూ, అన్ని భాషల అభివృద్ధికి కృషి చేస్తోందని వ్యాఖ్యానించిన తేజస్వీ సూర్య, తమ పార్టీకి కన్నడ అయినా, తెలుగు అయినా, తమిళం అయినా ఒకటేనని, ఎవరు గెలిచినా, హిందుత్వం గెలిచినట్టేనని అన్నారు. డీఎంకేను కుటుంబ పార్టీగా అభివర్ణించిన తేజస్వి, బీజేపీ పార్టీయే ఓ కుటుంబమని అన్నారు.

More Telugu News