Rohit Sharma: వారేమైనా మా గురించి ఆలోచించారా? మేమెందుకు ఆలోచించాలి?: రోహిత్ శర్మ

  • భారత పిచ్ లపై విదేశీ మాజీ క్రికెటర్ల విమర్శలు
  • ఇప్పుడు కొత్తగా చేస్తున్నదేమీ లేదన్న రోహిత్ శర్మ
  • ఎవరైనా తమకు అనుకూలంగానే తయారు చేసుకుంటారని వ్యాఖ్య
Rohit Sharma Comments on Indian Cricket Pitches

ఇండియాలోని క్రికెట్ పిచ్ లపై విదేశీ ఆటగాళ్లు చేస్తున్న విమర్శలపై ఓపెనర్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇంగ్లండ్ తో కీలకమైన మూడవ టెస్ట్ కు మరో రోజు మాత్రమే మిగిలున్న వేళ, క్రికెట్ ఆడే ప్రతి దేశంలోనూ జరిగేదే ఇండియాలోనూ జరుగుతుందని వ్యాఖ్యానించాడు. మూడవ టెస్ట్ అహ్మదాబాద్ లో డే అండ్ నైట్ మ్యాచ్ గా జరుగనున్న సంగతి తెలిసిందే.

"ఇరు జట్లకూ పిచ్ ఒకటే. ఆసలీ చర్చ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఉపఖండంలోని పిచ్ లను ఇలానే తయారు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేస్తున్నదేమీ లేదు" అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది.

కాగా, ఇండియాలో రెండో టెస్టు తరువాత మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, మార్క్ వా తదితరులు చెపాక్ పిచ్ పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల ఆట ఆడేందుకు ఈ పిచ్ పనికిరాదని మండిపడ్డారు. ఏ దేశమైనా తమ ఆటగాళ్లకు, పరిస్థితులకు, బలాబలాలకు అనుగుణంగానే క్రికెట్ పిచ్ లను తయారు చేసుకుంటుందని, గతంలో ఏ దేశమైనా భారత ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని పిచ్ లను తయారు చేసిందా? అని ప్రశ్నించాడు.

వారు ఆలోచించకుంటే, మనమెందుకు ఆలోచించాలని రోహిత్ విమర్శించాడు. ఇండియా విదేశాల్లో పర్యటిస్తున్న వేళ ఎన్నో సార్లు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్న రోహిత్, ఆటగాళ్లు బాగా ఆడితే ప్రతిభను, ఆడకుంటే పిచ్ లను నిందించడం విదేశీ మాజీలకు అలవాటేనని మండిపడ్డాడు.

More Telugu News