పెదకూరపాడులో సర్పంచ్ ఫలితంపై గందరగోళం.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సర్పంచ్ అభ్యర్థి భర్త

22-02-2021 Mon 08:41
  • ఒకసారి ఒకరు, మరొకసారి మరొకరు గెలిచినట్టు అధికారుల ప్రకటన
  • అధికారులను వెళ్లకుండా అడ్డుకున్న ఓ వర్గం వారు
  • గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు
Election officials not allowed to go in Pedakurapadu

గుంటూరు జిల్లా పెదకూరపాడులో నిన్న జరిగిన నాలుగో విడత ఎన్నికల్లో ఓ మహిళ రెండు ఓట్ల తేడాతో సర్పంచ్‌గా గెలుపొందడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ గెలుపును అంగీకరించని ప్రత్యర్థులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో మరోమారు ఓట్లను లెక్కించిన అధికారులు రాజు అనే వ్యక్తి నాలుగు ఓట్ల ఆధిక్యంతో నెగ్గినట్టు తెలిపారు.

దీంతో ఇంకోసారి రీకౌంటింగ్ కోసం మహాలక్ష్మి వర్గీయులు పట్టుబట్టారు. దీంతో మళ్లీ రీకౌంటింగ్ చేపట్టగా వైసీపీ బలపరిచిన మహాలక్ష్మి విజయం సాధించినట్టు అర్ధరాత్రి తర్వాత అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత కాసేపటికే టీడీపీ మద్దతు ఇచ్చిన రాజు గెలిచినట్టు పేర్కొన్నారు. దీంతో ఎవరు గెలిచారో తెలియక గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో మరోమారు కౌంటింగ్ నిర్వహించాలని మహాలక్ష్మి మద్దతుదారులు పట్టుబట్టారు. అయితే, పదేపదే రీకౌంటింగ్ కుదరదని అధికారులు తేల్చి చెప్పి గ్రామం నుంచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో మహాలక్ష్మి భర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రీకౌంటింగ్ కోసం ఓ వర్గం, వద్దని మరో వర్గం ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని భారీగా మోహరించారు.