Niti Aayog: మరికొన్ని రోజుల్లోనే ప్రైవేటు రంగం ద్వారా కరోనా టీకా: నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్

Want Private Presence in Vaccine says Niti Aayog
  • వ్యాక్సిన్ డ్రైవ్ వేగం పుంజుకోవాలి
  • ఇప్పటివరకూ 1.07 కోట్ల డోస్ ల పంపిణీ
  • త్వరలోనే స్పుత్నిక్ వీకు అనుమతి
  • నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్
ఇండియాలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగంగా ముందుకు సాగాలంటే, ప్రైవేటు రంగం ప్రాతినిధ్యం తప్పనిసరని, రోజుల వ్యవధిలోనే వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ప్రైవేటు రంగానికి కూడా అనుమతి లభిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకూ 1.07 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను హెల్త్ కేర్ వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లకు ఇచ్చామని ఆయన అన్నారు. ప్రస్తుతం కూడా వ్యాక్సిన్ పంపిణీలో ప్రైవేటు భాగస్వామ్యం కొనసాగుతోందని, ప్రతి 10 వేల వ్యాక్సినేషన్ సెషన్లలో 2 వేల సెషన్లు ప్రైవేటు ద్వారా జరుగుతున్నాయని, దీన్ని మరింతగా పెంచుతామని ఆయన అన్నారు.

ఇక రష్యాలో తయారైన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కు ఇండియాలో అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తే, తానెంతో సంతోషిస్తానని డాక్టర్ పాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ ను ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 1,600 మందికి ఈ టీకాను ఇచ్చి, ఫలితాలను సమీక్షిస్తున్నారు.

ఇదిలావుండగా, దేశంలోని అన్ని ఆసుపత్రుల ద్వారా వ్యాక్సిన్ ను పంపిణీ చేయాలని సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) ఇటీవల కేంద్రాన్ని కోరింది. అప్పుడే తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ చేరుతుందని సీఐఐ చీఫ్ ఉదయ్ కోటక్, ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Niti Aayog
Dr VK Paul
Vaccine
Corona Virus

More Telugu News