Madhya Pradesh: మొబైల్ సిగ్నల్స్ అందడం లేదట.. 50 అడుగుల ఎత్తులో ఊయలలో కూర్చుని పనిచేస్తున్న మధ్యప్రదేశ్ మంత్రి!

MP minister climbs atop village fair swing for phone signal
  • అశోక్‌నగర్ జిల్లాలోని  అమ్ఖో గ్రామంలో ఘటన
  • ఓ కార్యక్రమం నిమిత్తం ఇక్కడే ఉంటున్న మంత్రి
  • అధికారులతో మాట్లాడేందుకు ఊయల ఎక్కుతున్న అమాత్యుడు
50 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న మధ్యప్రదేశ్ మంత్రికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన అలా 50 అడుగుల ఎత్తులో ఫోన్‌లో మాట్లాడడం వెనక ఓ కారణం ఉంది. కారణం ఏదైనా సోషల్ మీడియాలో మాత్రం ‘డిజిటల్ ఇండియా’పై మీమ్స్, జోకులతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.

మధ్యప్రదేశ్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ మంత్రి బ్రజేంద్రసింగ్ యాదవ్ అశోక్‌నగర్ జిల్లాలోని అమ్ఖో గ్రామంలో 50 అడుగుల ఎత్తులో ఓ ఉయ్యాల ఏర్పాటు చేసుకున్నారు. రోజూ దానిపైకెక్కి అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఎందుకలా? అని ఆయనను ప్రశ్నిస్తే.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి రోజు తన వద్దకు వస్తున్నారని, ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకనే సిగ్నల్స్ కోసం 50 అడుగుల పైకెక్కి ఉయ్యాలలో కూర్చుని అధికారులతో మాట్లాడి గ్రామస్థుల సమస్యలు తీర్చుతున్నట్టు చెప్పారు. గ్రామంలో జరుగుతున్న ‘భగవత్ కథ’, ‘శ్రీరామ్ మహాయగ్య’ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 9 రోజులుగా ఇక్కడే ఉంటున్నట్టు మంత్రి చెప్పారు. ఇక్కడ సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో ఈ ఏర్పాట్లు చేసుకున్నట్టు చెప్పారు.
Madhya Pradesh
Minister
Phone Signal

More Telugu News