ఈ మాత్రానికే చొక్కాలు చించుకుంటే ఎలా?: సజ్జల

21-02-2021 Sun 21:36
  • ముగిసిన పంచాయతీ ఎన్నికలు
  • టీడీపీ ఆఫీసు వద్ద సంబరాలు
  • సెటైర్ వేసిన సజ్జల
  • చంద్రబాబు ప్రతి పంచాయతీని ఓ అసెంబ్లీ స్థానంలా చూపారని విమర్శలు
Sajjala satires on opposition leaders

ఏపీలో ఇవాళ్టితో పంచాయతీ ఎన్నికలు పరిసమాప్తి అయ్యాయి. చివరి విడత పోలింగ్ ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అటు విపక్ష టీడీపీ కూడా సంబరాలు చేసుకుంటోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పంచాయతీల్లో నాలుగు స్థానాలు గెలవగానే చొక్కాలు చించుకుంటున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు.

ఈ స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి పంచాయతీని ఓ అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో చూపించారని విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తోంది అనే అపవాదు వాస్తవం కాదన్నది ఈ ఫలితాలతో తేలిపోయిందని సజ్జల స్పష్టం చేశారు. ఓటమిని అంగీకరించలేని చంద్రబాబే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ సర్కారు పనితీరుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనమని ఉద్ఘాటించారు.