దేశంలో పెట్రో ధరల పెంపు దోపిడీకి ఏం తీసిపోదు: ప్రధాని మోదీకి లేఖ రాసిన సోనియా

21-02-2021 Sun 20:50
  • గత 12 రోజులుగా భగ్గుమంటున్న చమురు ధరలు
  • ప్రజల బాధలను కేంద్రం సొమ్ముచేసుకుంటోందన్న సోనియా
  • లాభాల వేటకు ప్రాధాన్యత ఇస్తోందని వ్యాఖ్యలు
  • అంతర్జాతీయంగా క్రూడ్ ధర సాధారణంగా ఉందని వెల్లడి
  • భారత్ లో ధరలు తగ్గకపోవడంపై ఆశ్చర్యం
Sonia Gandhi writes PM Modi over petro prices hike

దేశంలో చమురు ధరలకు రెక్కలొచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత 12 రోజులుగా పెట్రో ధరలు అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయని, చమురు ధరలను నేలకు దించాలని ప్రధానికి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న తీరు దోపిడీకి ఏం తీసిపోదని సోనియా అభివర్ణించారు. ప్రజలు ఎంతో బాధపడుతుంటే, ఆ విచారాన్ని కేంద్ర ప్రభుత్వం సొమ్ము చేసుకుంటోందని విమర్శించారు.

ఆయిల్, గ్యాస్ ధరలు భగ్గుమంటుడం పట్ల ప్రతి పౌరుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఉద్యోగాలు హరించుకుపోతున్నాయని, వేతనాలు తగ్గిపోతున్నాయని, కుటుంబ ఆదాయం పడిపోతోందని వివరించారు. నిత్యావసర వస్తువులు సైతం ధరలు పెరిగాయని, ప్రజలు ఇంతటి సమస్యల్లో ఉంటే ప్రభుత్వం మాత్రం లాభాల వేటకు ప్రాధాన్యత ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఇంత స్థిరంగా, ఏమాత్రం తగ్గుదల అన్నది లేకుండా చమురు ధరలు పెరగడం చరిత్రలో మునుపెన్నడూ లేదని సోనియా అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఓ మోస్తరుగా ఉన్న సమయంలో భారత్ లో చమురు ధరలు ఆకాశాన్నంటుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. గత ఆరున్నరేళ్ల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇంధన ధరల పెంపుకు కారణం అని ఆరోపించారు. డీజిల్ పై 820 శాతం, పెట్రోల్ పై 258 శాతం ఎక్సైజ్ సుంకం పెంచారని, తద్వారా రూ.21 లక్షల కోట్ల మేర వసూలు చేశారని సోనియా వివరించారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ధరలు తగ్గించడానికి అంగీకరించకపోవడం క్రూరత్వం అని విమర్శించారు. ఎక్సైజ్ సుంకాన్ని పాక్షికంగా తగ్గించడం ద్వారా రాజ ధర్మం పాటిస్తూ దేశంలో చమురు ధరలు తగ్గించేందుకు నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీకి స్పష్టం చేశారు.