పంచాయతీ ఎన్నికల్లో 2.26 కోట్లమంది ఓటేశారు: కమిషనర్ గిరిజా శంకర్

21-02-2021 Sun 20:30
  • ఏపీలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు
  • నేడు ముగిసిన చివరి విడత ఎన్నికలు
  • మీడియాకు వివరాలు తెలిపిన గిరిజా శంకర్
  • అధికారులు సమర్థంగా పనిచేశారని కితాబు
  • పోలీసులపైనా ప్రశంసలు
Panchayat department commissioner Girija Shankar detailed all phases of Gram Panchayat Elections

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతల్లో జరగ్గా ఇవాళ చివరి విడత కూడా ముగిసింది. దీనిపై రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మీడియాకు వివరాలు తెలిపారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని వెల్లడించారు. కలెక్టర్లు, జేసీలు, జడ్పీ సీఈవోలు సమర్థంగా పనిచేశారని కితాబిచ్చారు.

ఎన్నికల కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని ప్రశంసించారు. మొత్తం నాలుగు దశల్లో 2,197 పంచాయతీలు, 47,459 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని వివరించారు. 4 దశల్లో 10,890 పంచాయతీలకు 82,894 వార్డులకు ఎన్నికలు జరిపినట్టు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో 2.26 కోట్ల మంది ఓటు వేశారని గిరిజాశంకర్ తెలిపారు. అయితే, 10 పంచాయతీలకు, 670 వార్డులకు నామినేషన్లు రాలేదని పేర్కొన్నారు. నామినేషన్లు రాని పంచాయతీలు, వార్డులపై ఎస్ఈసీకి నివేదించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.