స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ ఉద్యమిస్తే సహకరించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు: గంటా

21-02-2021 Sun 19:05
  • విశాఖ ఉక్కు కర్మాగారం కోసం గంటా పోరాటం
  • ఇటీవలే రాజీనామా చేసిన గంటా
  • విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలని సూచన
  • అప్పుడే కేంద్రానికి అర్థమవుతుందని వెల్లడి
Ganta Srinivasarao comments on Visakha Steel Plant privatisation

రాజకీయాలకు అతీతంగా పోరాడితేనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోగలమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా... విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే పోరాట తీవ్రత కేంద్రానికి అర్థమవుతుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం జగన్ ఏ తరహా ఉద్యమం చేద్దామన్నా సహకరించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని గంటా వెల్లడించారు.

ఏపీ బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరి విడనాడి, ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా అంశం సాకారం కాలేదని, రైల్వే జోన్ పెండింగ్ లో పడిపోయిందని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలోనూ ఒక మాట మీద లేకుండా, ఒకర్నొకరు విమర్శించుకుంటూ ఉంటే గత ఫలితాలే పునరావృతం అవుతాయని అన్నారు.  

బీజేపీ సహా దీనిపై మాట్లాడుతున్న నేతలు ఉద్యోగుల భద్రత గురించి మాట్లాడుతున్నారే తప్ప నూటికి నూరు శాతం ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఎవరూ చెప్పడంలేదని గంటా విమర్శించారు. విశాఖ ఉక్కు తెలుగువారి గుండె చప్పుడు అని ఉద్ఘాటించారు. ఇక తన రాజీనామా గురించి స్పీకర్ తో మాట్లాడానని, రాజీనామా విషయంలో తాను చాలా గట్టి నిర్ణయం తీసుకున్నానని, ఆమోదించాలని ఆయనకు వివరించానని వెల్లడించారు.