ISRO: వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఇస్రో చంద్రయాన్-3... గగన్ యాన్ కూడా అప్పుడే!

  • కరోనా వ్యాప్తి కారణంగా ఇస్రో ప్రణాళికల్లో మార్పు
  • గతేడాది జరగాల్సిన ప్రయోగాలు వచ్చే ఏడాదికి!
  • చంద్రయాన్-3, గగన్ యాన్ 2022లో నిర్వహిస్తామన్న ఇస్రో
  • పాత ఆర్బిటర్ నే చంద్రయాన్-3లో ఉపయోగిస్తామని వెల్లడి
ISRO will conduct Chandrayaan next year

చంద్రుడిపై పరిశోధనల కోసం ఉద్దేశించిన చంద్రయాన్-3 వచ్చే ఏడాదికి వాయిదా పడింది. వాస్తవానికి 2020లోనే చంద్రయాన్-3 నిర్వహించాల్సి ఉన్నా, కరోనా మహమ్మారి వ్యాప్తి ఇస్రో ప్రణాళికలకు విఘాతం కలిగించింది. దీనిపై ఇస్రో చైర్మన్ శివన్ మీడియాకు వివరాలు తెలిపారు. కరోనా వ్యాప్తి కారణంగా చంద్రయాన్-3 మాత్రమే కాకుండా, మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కూడా వాయిదా పడిందని వెల్లడించారు. ఈ ప్రయోగాలను 2022లో చేపడతామని చెప్పారు.

2019లో నిర్వహించిన చంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో, లోటుపాట్లను దిద్దుకుని ముందుకు వెళతామని వివరించారు. చంద్రయాన్-2 ప్రయోగంలో ఉపయోగించిన ఆర్బిటర్ నే చంద్రయాన్-3 ప్రయోగంలోనూ ఉపయోగిస్తున్నామని తెలిపారు. అంతేకాదు, గగన్ యాన్ ప్రాజెక్టు ద్వారా ముగ్గురు భారతీయులను రోదసిలోకి పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. దీనికోసం నలుగురు భారతీయులు రష్యాలో వ్యోమగామి శిక్షణ పొందుతున్నారని తెలిపారు.

గతంలో ఇస్రో చేపట్టిన పలు ప్రయోగాలు విఫలం అయ్యాయి. 2019 జూలై 22న ప్రయోగించిన చంద్రయాన్-2 కొద్దిలో వైఫల్యం చెందగా, అదే సంవత్సరం సెప్టెంబరు 7న చంద్రుడి అవతలివైపుకు ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ కూలిపోయింది.

More Telugu News