సీఎం కేసీఆర్, పోలీసులు రోహింగ్యాలను ప్రోత్సహిస్తున్నారు: ఎంపీ అరవింద్ 

21-02-2021 Sun 15:27
  • రాష్ట్రాన్ని బఫూన్లు పాలిస్తున్నారన్న అరవింద్
  • హోంమంత్రికి లా అండ్ ఆర్డర్ తెలియదని విమర్శలు
  • రోహింగ్యాలు దేశభద్రతకు సవాల్ గా మారారని వెల్లడి
  • ట్విట్టర్ పిట్ట కేటీఆర్ ఎందుకు కూయడంలేదని వ్యాఖ్యలు
MP Arvind says CM KCR and Police are encouraging Rohingyas

తెలంగాణను బఫూన్లు పరిపాలిస్తున్నారంటూ బీజేపీ యువ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, పోలీసులు రాష్ట్రంలో రోహింగ్యాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో బోగస్ అడ్రస్ లతో పాస్ పోర్టులు ఇస్తున్నారని తెలిపారు. హోంమంత్రికి లా అండ్ ఆర్డర్ అంటే ఏమిటో కూడా తెలియదని అన్నారు.  

మయన్మార్ లో వందలాది హిందువులను వధించిన రోహింగ్యాలు దేశభద్రతకే సవాల్ గా మారారని అన్నారు. భారత్ లో ప్రవేశించిన రోహింగ్యాలు ఐరిస్, బయోమెట్రిక్ లేకుండానే ఆధార్ కార్డులు సంపాదిస్తున్నారని వివరించారు. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ రోహింగ్యాలపై ఎందుకు కూయడంలేదని ప్రశ్నించారు.

తెలంగాణను రూ.4 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన కేసీఆర్ కుటుంబం తోలు తీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అరవింద్ స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ల తోలు తీస్తామంటున్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించడంలేదని విమర్శించారు.