కరోనా కాలంలో దాదాపు 150 దేశాలు భారత్‌ నుంచి లబ్ధి: ఐరాస ప్ర‌శంస‌లు

21-02-2021 Sun 13:34
  • జైశంక‌ర్ కు ఆంటోనియో గుటెర‌స్ లేఖ‌
  • వ్యాక్సిన్ల పంపిణీలో భారత్‌ గ్లోబల్‌ లీడర్
  • భారత్‌ చేపడుతున్న చర్యలు అద్భుతం
un praises india effort to produce vaccines

భార‌త్‌పై ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో ప‌లు దేశాల‌కు భార‌త్ ఔష‌ధాలు పంపిన విష‌యం తెలిసిందే‌. ప్ర‌స్తుతం క‌రోనా వ్యాక్సిన్ల‌ను పంపుతోంది. ఈ విష‌యాల‌ను ఇటీవ‌ల ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌రిపిన స‌మావేశంలో భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ప్ర‌స్తావించారు.

ఆయ‌న తెలిపిన విష‌యాల‌పై  ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పందిస్తూ జైశంక‌ర్ కు ఓ లేఖ పంపారు. వ్యాక్సిన్ల పంపిణీలో భారత్‌ గ్లోబల్‌ లీడర్ గా వ్యవహరిస్తోందని కొనియాడారు. కరోనాను అంత‌మొందించ‌డానికి భారత్‌ చేపడుతున్న చర్యలను ప్ర‌స్తావించారు.

కొన్ని నెల‌ల క్రితం నుంచి ప్రపంచ దేశాలకు భారత్‌ అందిస్తున్న సేవల్ని గుర్తుచేశారు. క‌రోనాను అరిక‌ట్టేందుకు ఔషధాలు, మెడికల్‌ కిట్లు, వెంటిలేటర్లు వంటివి అందిస్తోంద‌ని చెప్పారు. కరోనా కాలంలో దాదాపు 150 దేశాలు భారత్‌ నుంచి లబ్ధి పొందినట్లు తెలిపారు.

ప్రపంచానికి ప్ర‌స్తుతం ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజ‌న్యంతో త‌యారైన‌ కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ అందుతుందంటే అది భార‌త్ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని చెప్పారు. భార‌త్‌లో పెద్ద ఎత్తున ఆ వ్యాక్సిన్ త‌యార‌వుతోంద‌ని చెప్పారు. కాగా, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే.