తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ!

21-02-2021 Sun 12:31
  • కుత్బుల్లా‌పూర్  మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా
  • నేడు బీజేపీకి తీర్థం పుచ్చుకోనున్న నేత‌
  • జేపీ న‌డ్డాను క‌ల‌వడానికి ఢిల్లీకి
srishailam goud resigns

తెలంగాణ  కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు, కుత్బుల్లా‌పూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీని వీడారు. ఈ మేర‌కు కాంగ్రెస్ నేత‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై కొంత కాలంగా ఆయ‌న‌ అసంతృప్తిగా ఉన్నారు.

ఆయ‌నతో కొన్ని రోజులుగా బీజేపీ నాయ‌కురాలు డీకే అరుణ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న రాజీనామా చేసిన‌ట్లు స‌మాచారం. నిన్న సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు డీకే అరుణ ఢిల్లీ వెళ్లగా ఈ రోజు ఉదయం కూన శ్రీశైలం కూడా అక్క‌డ‌కు బయలుదేరారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా శ్రీశైలం గౌడ్‌ రాజీనామా చేశారు.  ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని చెప్పారు.